కృషితో నాస్తి దుర్భిక్షం!

ఒంగోలు: ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మహిళా విభాగంగా జిల్లా స్థాయిలో ఆమె  ఏడో ర్యాంకు కైవసం చేసుకుంది. అయితే.. ఏంటి అనే ప్రశ్న వెంటనే ఇక్కడ ఉత్పన్నం కావడం సహజం. కానీ ఆమె నేపథ్యం తెలిస్తే ఔరా.. అని మాత్రం అనిపించక మానదు. బాల్యంలో ఆమెది దీనగాధ. చదువుకోవాలనే జిజ్ఞాస మాత్రం ఉంది. తప్పని పరిస్థితుల్లో వివాహం.. ఆపై భర్త వెంకటరత్నం ప్రోత్సాహం..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగాల కల్పన వెరసి ఆమె నేడు కష్టాల కొలిమి నుంచి బయట పడి ఒక స్థిరమైన జీవితాన్ని అందుకోగిలిగింది. ఆమే సంతనూతలపాడు మండలం ఎండ్లూరుకు చెందిన కోరుకొండ సుభాషిణి.  




సుభాషిణి జీవితం ఆదిలో ముళ్లపాన్పే. 9వ తగరతి చదువుతుండగానే తండ్రి కన్నుమూశాడు. ఆర్థిక బాధలు ప్రారంభమయ్యాయి. ఇద్దరు అన్నయ్యలు ఒక వైపు చదువుకుంటుండగా ఆమె బాల కార్మికురాలిగా మారింది. ఇలా నాలుగేళ్లు గడిచాయి. ఆమెకు తన మేనమామ ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న కోరుకొండ రామారావు అండగా నిలిచాడు. చిన్నపిల్లను పనిలోకి పంపడం ఏమిటంటూ చదువుకోమన్నాడు. పెళ్లి చేయాలనుకుంటుంటే బడి అంటారేంటంటూ తల్లి ఒప్పుకోలేదు. అయినా ఒప్పించి నెల్లూరులోని డ్రాపౌట్స్‌ ఉండే సర్వీస్‌ హోమ్‌లో చేర్పించారు. అక్కడ ఉండి చదువుకుంటూ సంతనూతలపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రైవేటుగా పదో తరగతి పరీక్ష రాసి ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది. ఆ సమయంలోనూ పెళ్లి చేసుకోవాల్సిందే.. అంటూ తల్లి పట్టుబట్టింది. అప్పటికే తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం, తన కళ్ల ముందే పెళ్లి జరగాలని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో మెడలు వంచి తాళి కట్టించుకుంది. ఇక తన చదువుకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే అని భావించింది.